చెంచుల తరలింపు కోసం ప్రయత్నాలు

మహాబూబ్ నగర్, ఫిబ్రవరి 9: అమ్రాబాద్‌ అభయారణ్యం నుంచి అడవి బిడ్డలను తరలించేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల అధికారులు తరచూ చెంచుపెంటలకు వస్తూ.. పక్కాఇళ్లు కట్టిస్తామని, భారీగా ప్యాకేజీ ఇస్తామని ఒత్తిడి చేస్తున్నారని చెంచులు చెప్తున్నారు. తాము అడవి బయట బతకలేమని చెప్తున్నా వినడం లేదని.. చెంచుపెంటల్లోని గిరిజనేతరులకు గాలమేసి, వారితో ఒత్తిడి చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ మధ్య చిచ్చుపెట్టి.. అడవి నుంచి గెంటివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. తమను బలవంతంగా మైదాన ప్రాంతాలకు తరలిస్తే బతకలేమని, చెంచుజాతి పూర్తిగా నశించిపోతుందని వాపోతున్నారు. 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మహబూబ్‌నగర్, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, నల్లగొండ జిల్లాల్లో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతాన్ని రాజీవ్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌గా ఏర్పాటు చేశారు. పులులు, ఇతర అడవి జంతువుల ఆవాసాన్ని పెంచడం కోసం, సంరక్షణ కోసం చర్యలు చేపట్టారు. ఇతర ప్రాంతాల నుంచి చిరుతలు, వివిధ రకాల జంతువులను తీసుకొచ్చి నల్లమల పరిధిలో వదిలిపెట్టారు. అప్పట్లోనే అడవి మధ్యలో ఉన్న చెంచులను బయటికి తరలించాలని చూశారు. కానీ చెంచులు ఒప్పుకోలేదు. ఆ తర్వాత కూడా పలుసార్లు ప్రయత్నాలు జరిగినా చెంచులతోపాటు ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర పరిధిలో (కృష్ణానదికి ఇవతల) మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో విస్తరించిన అటవీ ప్రాంతాన్ని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌గా నామకరణం చేసింది. ఇటీవల అభయారణ్యం నుంచి చెంచులను తరలించేందుకు అటవీ శాఖ మళ్లీ సన్నాహాలు మొదలుపెట్టింది. కొద్దిరోజుల నుంచి కోర్‌ ఏరియాలోని చెంచుపెంటల్లో అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అమ్రాబాద్‌ మండలం కొల్లంపెంటకు చెందిన చెంచుల కోసం మాచారంలో ఆర్డీటీ సంస్థ నిర్మించిన ఇళ్లను ఇటీవల ఎఫ్‌డీవో రోహిత్‌రెడ్డి పరిశీలించారు.

దీనితో అటవీ ఉత్పత్తులే జీవనాధారంగా బతుకీడుస్తున్న చెంచు కుటుంబాలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయి. అటవీ అధికారులు కొద్దిరోజులుగా చెంచులపై ఒత్తిడి పెంచుతున్నారు. చెంచుపెంటల్లో సమావేశాలు ఏర్పాటు చేసి.. మైదాన ప్రాంతానికి తరలివెళ్తే భారీ ప్యాకేజీ ఇస్తామంటూ అంగీకార పత్రాలపై సంతకాలు తీసుకుంటున్నారు. 18ఏళ్లు నిండిన యువతను కూడా విడి కుటుంబంగా పరిగణిస్తామని.. నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) నుంచి రూ.15 లక్షల ప్యాకేజీని వర్తింపజేస్తామని గాలం వేస్తున్నారు. కొన్నిచోట్ల భూమి కూడా ఇప్పిస్తామని హామీలు ఇస్తున్నారు. అయినా చాలా వరకు చెంచులు అడవి బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. రెండు, మూడు చెంచుపెంటలు మినహా మిగతా చెంచు పెంటల్లో గిరిజనేతరులు సైతం జీవిస్తున్నారు. వటువర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతల బైలులో ఎక్కువగా ఎస్సీ, బీసీ కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుతం పక్కా ఇల్లు, రూ.15 లక్షల ప్యాకేజీ ఇస్తామని అటవీ అధికారులు ఒత్తిడి తెస్తుండటంతో గిరిజనేతరుల్లో ఆశలు పెరిగాయి. అందులో కొందరు గిరిజనేతరులు అడవి బయటికి రావడానికి సుముఖత వ్యక్తం చేయగా.. దీన్ని ఆసరాగా చేసుకుని చెంచులపై ఒత్తిడి పెంచుతున్నట్టు తెలిసింది. చెంచులు, గిరిజనేతరుల మధ్య చిచ్చుపెట్టి ‘పని’ సాధించుకునే కుయుక్తులు పన్నుతున్నట్టుగా ప్రజాసంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తొలిదశలో అభయారణ్యంలోని ఫర్హాబాద్, కొల్లంపెంటలోని చెంచులను తరలించే ప్రయత్నం జరుగుతోంది. ఈ రెండుచోట్ల 30 నుంచి 34 కుటుంబాలు జీవిస్తున్నాయి. కొల్లంపెంటకు చెందిన చెంచులను మాచారంలో ఆర్డీటీ సంస్థ నిర్మించిన ఇళ్లలోకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అక్కడే ఇళ్లతోపాటు భూమి కూడా ఇవ్వాలనే డిమాండ్‌ కొందరు చెంచుల నుంచి వ్యక్తమవుతోంది. మాచారం, దాని సమీపంలో ప్రభుత్వ భూముల్లేవు.

ఇక్కడి మొల్కమామిడిలో ఓ ప్రైవేట్‌ వ్యక్తికి చెందిన 29 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసేందుకు అటవీశాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఫర్హాబాద్‌ చెంచులను లింగాల మండలం బాచారానికి తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అక్కడి చెంచులు ఇందుకు అంగీకరించారనీ చెప్తున్నారు. కానీ ఫర్హాబాద్‌ చెంచులు, సమీపంలోని ఇతర పెంటల్లోని చెంచులు మన్ననూర్‌కుగానీ, వేరే ఏజెన్సీ గ్రామాలకుగానీ పంపితేనే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్యాకేజీ రూ.15 లక్షలతోపాటు ఉచితంగా ఐదెకరాల వ్యవసాయ భూమి, పక్కా ఇల్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. 1999లో నక్సల్స్‌ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు నల్లమలలోని కొన్ని చెంచు కుటుంబాలను మైదాన ప్రాంతాలకు తరలించారు. అమరగిరి వద్ద ప్రత్యేక పునారావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ అక్కడి వాతావరణ పరిస్థితుల్లో ఇమడలేక ఇద్దరు చెంచులు మరణించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. నల్లమలలో యురేనియం తవ్వకాలు, అభయారణ్యం పేరిట చెంచులను మరోసారి మైదాన ప్రాంతాలకు తరలించే ప్రయత్నం ప్రారంభించారు. ఈ క్రమంలో కుటుంబానికి రూ.10 లక్షల నగదుతోపాటు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఇళ్లు నిర్మించి ఇస్తామని అధికారులు చెప్పినా.. అడవి బిడ్డలు అంగీకరించలేదు. తర్వాత నగదుతోపాటు రంగారెడ్డి జిల్లా బాచారం దగ్గర ఇళ్ల నిర్మాణం, నగదు కాదనుకుంటే మూడెకరాల వ్యవసాయ భూమి ఇస్తామని కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నగదు ప్యాకేజీని రూ.15 లక్షలకు పెంచారు. నల్లమలలోని వటువర్లపల్లి, సార్లపల్లి, పులిచింతలబైలు, కొమ్మనపెంట, కొల్లంపెంట, మల్లాపూర్, అప్పాపూర్, బౌరాపూర్, రాంపూర్, సంగిడిగుండాల, మేడిమొల్కల, ఈర్లపెంటల్లో 175 చెంచు కుటుంబాలు నివసిస్తున్నాయి. గతంలో 80శాతం కుటుంబాలతో అంగీకార పత్రాలపై బలవంతంగా సంతకాలు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి.

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో చెంచుల వివరాలివీ..
చెంచు పెంటలు 112
కుటుంబాలు 2,630
జనాభా 9,514
కోర్‌ ఏరియాలోని చెంచుపెంటలు: నల్లమల పరిధిలోని అమ్రాబాద్, వటువర్లపల్లి, సార్లపల్లి, పులిచింతలబైలు, కొమ్మనపెంట, కొల్లంపెంట, మల్లాపూర్, లింగాల మండలం అప్పాపూర్, బౌరాపూర్, రాంపూర్, సంగిడిగుండాల, మేడిమొల్కల.

Leave A Reply

Your email address will not be published.