ఘనంగా అవంతిపురం నూతన మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం
రథ సారథి,మిర్యాలగూడ:
మూడు గంటలు కరెంటు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి ప్రజల్లోకి రావాలని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి లు అన్నారు. శనివారం అవంతిపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు నిర్వహించిన మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో విస్తృత సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 4వేల పింఛన్ ఇస్తామని ప్రకటిస్తున్నారని, ముందుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అమలు చేయాలన్నారు. అక్కడ ఇచ్చే దమ్ము లేని కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఇస్తారని ప్రగల్భాలు పలుకుతున్నారని ప్రజలు గ్రహించాలని కోరారు. ఏనాడు వ్యవసాయం చేయని రేవంత్ రెడ్డి వ్యవసాయానికి మూడు గంటలు కరెంట్ సరిపోతుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మూడు గంటలు కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలో… 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చే కేసీఆర్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. ఏటా రూ .30 వేల కోట్ల నష్టం వస్తున్నా రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత కేసిఆర్ కే దక్కుతుందన్నారు. ప్రాణం పోయినా వ్యవసాయానికి మీటర్లు పెట్టబోమని కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో బడా నాయకుడిగా చలామణి అవుతున్నవారు ఏనాడు జిల్లా అభివృద్ధి కోసం పని చేయక పోగా, తామే కాబోయే ముఖ్యమంత్రులమని ప్రచారం చేసుకుంటున్నట్లు విమర్శించారు. తెలంగాణా దేశానికే అన్నపూర్ణగా మారింది అన్నారు. త్వరలోనే గోదావరి నీళ్లను నల్గొండ జిల్లాకు తెప్పించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడని, అది జరిగితే ఆయకట్టులో మూడు కార్లు పంటలు పండుతాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారం పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మూడో సారి సీఎం గా కేసీఆర్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. నియోజవర్గంలో 1960 మందికి బీసీ రుణాలు అందిస్తున్నామని, అన్ని గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు అందించి, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే భాస్కర్ రావు తెలిపారు. రైతులు మిల్లర్లకు నూతన పాలకవర్గం సమన్వయం చేస్తూ పాలన సాగించాలని కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా బైరం బుచ్చయ్య, వైస్ చైర్మన్ గా కుందూరు వీర కోటిరెడ్డి తోపాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయగా అధికారులు, రైస్ మిల్లర్స్ ఆసోసియేషన్ కమిటీ, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో నూతన కమిటీకి సన్మానం చేశారు. కార్యక్రమంలో అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, ఆర్డీఒ చెన్నయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఏడీఏ నాగమణి, మార్కెట్ ఎడి శ్రీకాంత్, నాగమణి, కార్యదర్శి శ్రీధర్, పీఏసీఎస్ చైర్మన్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.