డిసెంబర్ లోపే ఎన్నికలు..?

హైదరాబాద్, ఫిబ్రవరి 17: రాష్ట్రంలో అధికార పార్టీలో ముందస్తు రాగం బలంగా వినిపిస్తున్నది. ఏర్పాట్లు కూడా ఆ దిశగానే సాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల మొదలు సర్పంచుల వరకూ క్షేత్రస్థాయిలో కార్యాచరణ మొదలైంది. “ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండండి” అని గులాబీ బాస్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపారు. ఈ ఏడాది జూన్ – డిసెంబర్ మధ్యలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న గుసగుసలు గులాబీ పార్టీలోనూ బలంగా వినిపిస్తున్నాయి. వీలైతే గుజరాత్ అసెంబ్లీ లేదా కర్నాటక అసెంబ్లీతో పాటు రాష్ట్రంలోనూ ఎన్నికలు జరిగేలా ఆలోచనలు సాగుతున్నాయి.రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరు వరకూ ఉండే అవకాశం ఉన్నదని సీఎం కేసీఆర్ స్వయంగా మీడియా ప్రతినిధులకు లీకులు ఇచ్చారు. ఆనవాయితీ ప్రకారం జరిగే టీఆర్ఎస్ఎల్పీ (శాసనసభా పక్ష) సమావేశంలోనే ఎమ్మెల్యేలకు ముందస్తు ఎన్నికలపై సంకేతాలిచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

జూన్-డిసెంబరు మధ్య కాలంలో ఎప్పుడైనా అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉన్నదని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది చివరలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణకూ జరిగితే ఏ విధంగా ఉంటుంది? లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరిగేతే ఎలా ఉంటుందనేది ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.టీఆర్ఎస్ అధినేతకు ముందస్తు ఎన్నికలకు వెళ్లడంపై స్పష్టమైన క్లారిటీ ఉండడంతో మంత్రులకు ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు. ‘ముందస్తు ఎన్నికలుండవ్.. షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి’ అంటూ కేసీఆర్ ఇటీవలే మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. కానీ పార్టీ కార్యక్రమాలు మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుండడంతో శ్రేణుల్లోనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రతి రోజూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతుండడం వారి అనుమానాలకు బలం చేకూరుస్తున్నది.రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు ఊపిరి సలపనివ్వకుండా చేయాలన్నదే టీఆర్ఎస్ వ్యూహం. యూపీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మరింత పకడ్బందీ వ్యూహం రూపొందనున్నది. ఆ ఎన్నికల ఫలితాలు ఏ పార్టీపై, ఏ రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది విశ్లేషించుకున్న తర్వాత దానికి తగినట్లు తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ లోపు టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలోనే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోని తాజా పరిస్థితులను ఎమ్మెల్యేల ద్వారా తెలుసుకుని వారిని సన్నద్ధం చేయడంపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలిసింది. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమల్లోకి రాని వాటిపై ఈ బడ్జెట్‌లోనే క్లారిటీ ఇచ్చి తగినన్ని నిధులు కేటాయించే అవకాశం ఉన్నది. అన్ని సెక్షన్ల ప్రజలనూ ఆకట్టుకునేలా ఎన్నికల బడ్జెట్ తరహాలోనే రూపొందించడంపై ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.బీజేపీ వ్యతిరేక వైఖరిని కేసీఆర్ సందర్భానుసారం బలంగా వినిపిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో ఇటీవల ప్రధాని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని వ్యాఖ్యలను బలంగా వినిపించి సెంటిమెంట్‌ను వాడుకోవాలని అనుకుంటున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని అనుకుంటున్నారు. ఏయే సెక్షన్ల ప్రజల్లో పార్టీపై అసంతృప్తి ఉన్నదో ఇప్పటికే ఆయన ఓ అంచనాకు వచ్చారు. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి యువతను కూల్ చేయాలని అనుకుంటున్నారు. ముందస్తు ఎన్నికలు ఉండవని చెప్పినా టీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రమే కాక ప్రతిపక్ష పార్టీల్లోనూ బలమైన అనుమానాలే ఉన్నాయి. అసెంబ్లీని మధ్యలోనే రద్దు చేయొచ్చన్న అభిప్రాయాలూ ఉన్నాయి. అయితే ఎప్పుడు రద్దు చేయాలి ? ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చేలా ప్లాన్ చేయాలన్న అంశం యూపీ ఫలితాల తర్వాతనే కొలిక్కి రానున్నది.

Leave A Reply

Your email address will not be published.