కెసిఆర్ అసలు సిసలు హిందూ వ్యతిరేకి: విజయశాంతి

హైదరాబాద్ ఫిబ్రవరి 10: తెలంగాణా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర రావుపై బీజేపీ నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన అసలు సిసలు హిందూ వ్యతిరేకి అని, ఆయన ఆ విషయాన్ని పదే పదే రుజువు చేసుకుంటున్నారని చెప్పారు. హిందువులను అవమానిస్తున్న ఒవైసీ సోదరులను ఆయన మచ్చిక చేసుకుంటున్నారని, వారికి నిరంతరం మద్దతిస్తున్నారని అన్నారు. తాజాగా ‘సమతా మూర్తి’ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు గైర్హాజరయ్యారని, ఇలాంటి వ్యక్తిత్వంగల ఆయనను ఎలా ఇంటికి పరిమితం చేయాలో ప్రజలకు తెలుసునని చెప్పారు. ఆమె ఫేస్‌బుక్ పోస్ట్ యథాతథంగా… తెలంగాణ సీఎం కేసీఆర్ గారి తీరుతో ఆయన పక్కా హిందూ వ్యతిరేకి అనే విషయం అడుగడుగునా స్పష్టమవుతోంది. తాజాగా కేంద్ర బడ్జెట్ సందర్భంగా కేసీఆర్ గారు కేవలం బీజేపీని తిట్టిపోసేందుకే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో టీఆరెస్ సయామీ కవల పార్టీ అయిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఒక వెలుగు వెలగాలని పదే పదే కోరుకున్నారు. ఈ సందర్భంగా అసదుద్దీన్‌ని తమ సోదరుడని చెబుతూ… ఎంఐఎంని ఉద్దేశించి అసంకల్పితంగా ‘హమారా పార్టీ హై’… అని కూడా అనేశారు. ‘నా సోదరుడిని (అసదుద్దీన్) జాతీయ రాజకీయాల్లో మెరవనివ్వండి… తప్పేంటి? అని ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కేసీఆర్ స్పందించారు.

కానీ ఇదే అసదుద్దీన్, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ గతంలో ఎన్నిసార్లు హిందువులను ఉద్దేశించి చులకనగా వ్యాఖ్యలు చేసి అవమానించారో… హెచ్చరించారో… బెదిరింపులకు పాల్పడ్డారో ఒక్కసారి యూట్యూబ్‌లో వారి పాత వీడియోలు చూస్తే అర్థమవుతుంది. 15 నిమిషాలు పోలీసుల్ని పక్కన పెడితే 100 కోట్ల మంది హిందువులకు వారి చోటేమిటో చూపిస్తామని వ్యాఖ్యానించింది ఎవరు?… మొన్నటికి మొన్న యూపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ… మోదీ గారు, యోగి గారు ఆ పదవుల నుంచి తప్పుకుంటే అప్పుడు మీ గతేంటో చూసుకోండి, మేం మర్చిపోం… అని యూపీ పోలీసులకి, అధికారులకి హెచ్చరికలు జారీ చేశారు.

ఇదీ టీఆరెస్ సయామీ కవల పార్టీ అయిన ఎంఐఎం అధినేత, ఆ పార్టీ నేతల తీరు. ఇలా ఎన్నో సార్లు ఎంఐఎం నేతలు హిందువులకు వ్యతిరేకంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేసినా పట్టనట్టు వ్యవహరిస్తూ… చేతగాని దద్దమ్మలా పడి ఉండటమే గాక వారికి మద్దతు పలుకుతున్న సీఎం కేసీఆర్‌ని హిందూ వ్యతిరేకి గాక మరేమనాలి? చివరికి యాదాద్రి ఆలయాన్ని కూడా వ్యక్తిగత ప్రచారానికి వాడుకుని తమ శిల్పాలు కూడా చెక్కించుకున్నారు… అందరూ ఛీ కొట్టాక వాటిని తొలగించారు. తాజాగా సమతామూర్తి రామానుజుల విగ్రహావిష్కరణకు హైదరాబాద్ విచ్చేసిన ప్రధానమంత్రిగారి కార్యక్రమానికి కావాలనే డుమ్మా కొట్టి ఒంట్లో బాగా లోదని అధికారులతో చెప్పించారు. కేసీఆర్ చేసే యాగాలు, పూజలు కేవలం హిందువుల ఓట్ల కోసమేనని ప్రజలకు బాగా తెలుసు… అలాగే… మిమ్మల్ని గద్దె దించి ఇంటికి ఎలా పరిమితం చెయ్యాలో కూడా వారికి బాగా తెలుసని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.