సర్దార్ ను స్మరించుకున్న నల్గొండ
రథ సారథి, మిర్యాలగూడ :
చకిలం శ్రీనివాసరావు లాంటి మహానేతలు రాజకీయాల్లో అరుదుగా కనిపిస్తారని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తనయుడు పివి ప్రభాకర్ రావు పేర్కొన్నారు.ప్రజా ప్రతినిధి అంటే ప్రజలకు నిధిలాంటివాడు అని అర్థమనీ, కానీ నేడు ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజల నిధులను కొల్లగొడుతు న్నారని ఆయన విమర్శించారు . నల్గొండ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సర్దార్ చకిలం శ్రీనివాసరావు శతజయంతి ఉత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీవీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఆనాటి రాజకీయ నాయకుల్లో సర్దార్ శ్రీనివాసరావు మహానేతగా పేరు గడించారని అన్నారు. కానీ నేటి నాయకులు డబ్బు గడిస్తూ బడానేతలుగా చలామనీ అవుతున్నారని విమర్శించారు. సర్దార్ అనే బిరుదు శ్రీనివాసరావుకు రావడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. సర్దార్ అంటే తన అనుచరులను నడిపించేవాడు, రక్షించేవాడు అని అర్థమని, సర్దార్ అనే బిరుదుకు శ్రీనివాసరావు సరిగ్గా సరిపోతాడని చెప్పారు. నాడు రాజకీయ మజిలీలు నీతి, నిజాయితీతో ఓటు ఉండేదని నేడు మద్యం, డబ్బుతో ముడిపడిపోయిందని వివరించారు. శ్రీనివాసరావు మరణించి 26 ఏళ్లు పైన గడిచినా ఆయన పై అభిమానం నేటికీ తగ్గకపోవడం తనని మంత్రముగ్ధున్ని చేసిందని తెలిపారు. ఆయన కుమారుడు చకిలం అనిల్ కుమార్ రాజకీయాల్లో కొనసాగుతూ ఉండడం చాలా సంతోషంగా ఉందనీ అటువంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఆయనకు భవిష్యత్ కాలంలో మంచి పదవులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ తన నాన్నగారి వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాననీ తన తండ్రి మరణానంతరమే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. ఇప్పటికి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నానని తెలిపారు. తనకు ప్రజల అండదండలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, జిల్లా నుంచి భారీ స్థాయిలో చకిలం శ్రీనివాసరావు అభిమానులు పాల్గొన్నారు.