మెడికో ప్రీతి ఘటనలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి
రథ సారథి,మిర్యాలగూడ:
వరంగల్ జిల్లాలోని కేఎంసి మెడికల్ కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ధరావత్ ప్రీతిది హత్య అని పలు కుల సంఘాలు ఆరోపించాయి. ఆదివారం స్థానిక అమరవీర స్తూపం వద్ద ప్రీతి చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. ప్రతి మృతి చెంది పది రోజులు దాటుతున్న నేటి వరకు నిందితులపై చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు.సీనియర్ మెడికో మహమ్మద్ సైఫ్ వేధింపుల వల్ల ఆందోళనకు గురవుతున్న ప్రీతిని మానసికంగా హింసించడంతోపాటు అనస్తిసియా మత్తుమందు ఇచ్చి హత్య చేశారని విమర్శించారు. తనకు జరుగుతున్న వేధింపుల విషయమై ప్రిన్సిపాల్ హెచ్వోడీలకు ఫిర్యాదు చేసిన సీనియర్ మెడికో సైఫ్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పోలీసు అధికారులు సైతం ప్రీతికి వేధింపుల విషయమై ఫిర్యాదు చేసిన సరైన సమయంలో స్పందించలేదని కావాలనే తాత్సారం చేసి ప్రీతి మృతికి కారణమయ్యరన్నారు. ప్రీతి నిజంగా తానే స్వయంగా మత్తుమందు తీసుకుంటే ఎక్కడి నుంచి తీసుకున్నది, ఎలా తీసుకున్నది ఎందుకు కళాశాల యాజమాన్యం వెల్లడించడం లేదని ప్రశ్నించారు. ప్రీతి మృతి పై నిజ నిజాలను సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలను బహిర్గత పరచాలని డిమాండ్ చేశారు.ప్రీతి మృతి పై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి వెంటనే శిక్షించాలని కోరారు.కార్యక్రమంలో బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోతు దశరథ నాయక్ యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగోండి మురళి యాదవ్, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి ధానావత్ నీలకంఠ నాయక్,కుమ్మరి సంఘం డివిజన్ అధ్యక్షులు వెంకటయ్య, రవినాయక్,వినోదనాయక్,మంజు నాయక్,సుభాషిరెడ్డి,బిక్షం గౌడ్,బంటు కిషన్,లేవూరి కార్తీక్, సైదా నాయక్,తదితరులు పాల్గొన్నారు.