ప్రగతి నివేదన సభకు భారీగా తరలి రావాలి
మంత్రి జగదీష్ రెడ్డి
రథసారథి ,సూర్యాపేట:
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి రథసారథి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూర్యాపేట ప్రజలు జన నిరాజనాలు పలకాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 20న నిర్వహించే సూర్యాపేట ప్రగతి నివేదన సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆదివారం సూర్యాపేట పట్టణ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటుగా, ప్రగతి నివేదన సభకు హాజరుకానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి జగదీష్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి చేరిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఇక్కడ పలు అభివృద్ధి పనులను చేపట్టామన్నారు . ఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభా ప్రాంగణానికి తీసుకువెళ్లేందుకు సహకరించాలన్నారు. సూర్యాపేట పట్టణ పరిధిలో మెడికల్ కాలేజ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్, జిల్లా ఎస్పీ కార్యాలయం, జిల్లా కలెక్టరేట్ తో పాటుగా బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారని మంత్రి తెలిపారు. అనంతరం ఏర్పాటు చేయనున్న ప్రగతి నివేదన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారని ఈ సభకు కర్షకులు, కార్మికులు, మహిళలు, యువకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కరరావు ,రవీంద్ర కుమార్, చిరుమర్తి లింగయ్య , గాదరి కిషోర్ కుమార్ ,బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.