నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్ రాక..

రథ సారథి ,సూర్యాపేట:

సూర్యాపేట జిల్లా కేంద్రానికి నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. స్థానిక కుడకుడ రోడ్డులో నూతనంగా కలెక్టరేట్ భవనం, పాత జాతీయ రహదారి పక్కన మెడికల్ కాలేజీ, నల్లచెరువు సమీపంలో జిల్లా పోలీస్ కార్యాలయం, పాత వ్యవసాయ మార్కెట్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నేడు వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. వీటితో పాటుగా ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బీ ఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి అధ్యక్షతన ప్రగతి నివేదన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి రాక కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి జిల్లాకు వరాలు ప్రకటిస్తారన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారు. మొత్తానికి సూర్యాపేటను గులాబీ మయంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీర్చిదిద్దుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు , బీఆర్ఎస్ నాయకులు జన సమీకరణ కోసం ఇప్పటికే సమావేశాలను ఏర్పాటు చేశారు . ఆయా మండలాల నుంచి భారీ స్థాయిలో జన సమీకరణ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటకు చేరుకొని ఈ కార్యక్రమాలలో పాల్గొననున్నారు .ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.