సూర్యాపేట జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు..
మంచి నాయకుడు జగదీష్ రెడ్డి అని పొగిడిన సీఎం
రథసారథి ,సూర్యాపేట:
సూర్యాపేట జిల్లాలో ఆదివారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు పలు వరాలు కురిపించారు. సూర్యాపేటలోని 475 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 4 మున్సిపాలిటీ ( కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల )లకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇక సూర్యాపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ.50 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. సూర్యాపేట ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ సూర్యాపేటలో 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటి అభివృద్ధి కోసం డబ్బులు కావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు డబ్బులు అడిగిండ్రు. వాళ్ల కోరిక, ప్రజల కోరిక మన్నించి ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నా. ‘ అని తెలిపారు. సూర్యాపేటకు కళాభారతి కావాలని మంత్రి జగదీశ్ రెడ్డి కోరారని.. రూ.25కోట్లతో కళాభారతిని మంజూరు చేస్తున్నా అని ప్రకటించారు. కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసుకు దీటుగా కళాభారతిని నిర్మించాలని మంత్రి జగదీశ్ రెడ్డికి సూచించారు. ‘సూర్యాపేట కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వెళ్తుండగా చూస్తే వందలాది కొత్త బిల్డింగ్‌లు వచ్చినయ్. సూర్యాపేట అభివృద్ధిని కండ్లారా చూడాలని మొత్తం నాలుగు మూలలు తిరిగిన. అభివృద్ధిలో సూర్యాపేట దూసుకెళ్తున్నది.’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ సూర్యాపేట పట్టణం మరింత అభివృద్ధి చెందాలని.. కొత్త రోడ్లు కావాలని మంత్రి జగదీశ్ రెడ్డి కోరారు. ఆ కోరిక మేరకు మిగతా 4 మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున , సూర్యాపేటకు ప్రత్యేకంగా రూ.50కోట్లు మంజూరు చేస్తున్నా.’ అన్నారు. మహిళా పాలిటెక్నిక్ కాలేజీ కావాలని కూడా మంత్రి అడిగారని.. దాన్ని కూడా మంజూరు చేస్తామన్నారు. స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు కూడా వెంటనే జీవో రిలీజ్ చేస్తామని తెలిపారు. మంత్రి జగదీశ్ రెడ్డి అడిగినట్లు ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ కూడా మంజూరు చేయాలని ఆ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి సూచించారు.
మంచి నాయకుడు జగదీశ్ రెడ్డి: మంత్రి జగదీష్ రెడ్డి మంచి నాయకుడు అని సీఎం కేసీఆర్ పొగిడారు. ఆయన ప్రోత్బలంతోనే సూర్యాపేట తీరుతె న్నులు మారాయని సీఎం గుర్తు చేశారు. ముందు ఎలాంటి వరాలు అడగను అని చెప్పిన జగదీష్ రెడ్డి నేను సూర్యాపేటకు వచ్చాక పలు వరాలు అడిగారని సీఎం కేసీఆర్ చలోక్తిగా అన్నారు. వాటిని మంజూరు చేయిస్తానని సీఎం కేసీఆర్ బహిరంగ సభలో హామీ ఇచ్చారు.