భాస్కర్ రావు గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం ….కేసీఆర్

రథసారథి ,మిర్యాలగూడ:

మిర్యాలగూడ నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేగా భాస్కరరావును లక్ష మెజార్టీతో గెలిపించాలని, ఆయన గెలుపుతోనే నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. భాస్కర్ రావు మంచి ప్రజా సేవకుడు అని, పట్టుదల ఉన్న నాయకుడని కేసీఆర్ అన్నారు. ఇలాంటి నాయకుడిని గెలిపించాల్సిన అవసరం మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజలపై ఉందన్నారు. భాస్కర్ రావు నాకు కుడి భుజం లాంటివాడని ,ప్రజల సమస్యలపై నిత్యం పరితపిస్తాడన్నారు. రైతు కుటుంబానికి చెందిన భాస్కర్ రావుకు రైతు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసునన్నారు. సాగర్ ఆయకట్టు ప్రాంతంలో శాశ్వతంగా సాగునీటి సమస్య నివారణకు కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి ఉదయ సముద్రం ద్వారా పెద్దదేవులపల్లి రిజర్వాయర్ లోకి నీటిని తరలించే ప్రక్రియ తమను గెలిపిస్తే వెంటనే పూర్తి చేస్తామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ నేడు తలసరి ఆదాయంలో, తాగునీటి సమస్యను తీర్చడంలో నెంబర్ వన్ గా ఉందన్నారు. గత కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పూర్తి అధోగతి పాలు అయిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలు అన్నిటినీ తీర్చుకుంటూ వచ్చామన్నారు. కరెంటు ఉత్పాదనలో కూడా తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. మరింత కరెంటు ఉత్పాదన కోసం దామరచర్ల మండలంలో రూ.30 వేల కోట్లతో థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టామన్నారు. భాస్కర రావును లక్ష మెజార్టీతో గెలిపిస్తే మిర్యాలగూడ నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చేయడానికి తాము కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేయాలని, ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ను కోరారు. నియోజకవర్గంలో రూ.2526 కోట్లతో సంక్షేమ పథకాలు, రూ.2971 కోట్లతో అభివృద్ధి పథకాలను చేపట్టామన్నారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో నిరుద్యోగులైన యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని, దామరచర్ల నుండి వీర్లపాలెం వరకు డబల్ రోడ్డు వేయించాలని, మిర్యాలగూడ పాత బస్టాండ్ లోని చిరు వ్యాపారులకు పట్టాలిప్పించాలని, ఎన్ఎస్పి క్యాంపు క్వార్టర్లలో పేద ఉద్యోగులకు క్వార్టర్లను అందించాలని, ఎన్ఎస్పీ క్యాంపులో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ,మిర్యాలగూడ పట్టణ పరిధిలోని అద్దంకి నార్కెట్పల్లి బైపాస్ రోడ్డు మీద నందిపాడు, చింతపల్లి ప్రాంతాలలో ఫ్లై ఓవర్ నిర్మాణాలను చేపట్టాలని కేసీఆర్ ను కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తిరు నగర్ భార్గవ్, పలువురు ప్రధాన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.